Saturday 24 October 2020

ఎలాగో ఇంకా చేసేది కూడా ఏమీ లేదు...!

నవ్వుతున్నా పెదాలలో సంతోషం లేదు,

చూస్తున్నా కళ్ళలో ఆనందం లేదు,

వింటున్నా చెవులకి హాయిగా లేదు,

సాయం చేస్తున్నా చేతులకి ఓపిక లేదు,

నడుస్తున్నా కాళ్ళకి దారి అర్ధం కావట్లేదు,

ఊపిరి పీలుస్తున్నా శ్వాస ఆడట్లేదు,

ఏడుస్తున్నా గుండెని బాధ వీడట్లేదు,

ఇంత జరుగుతున్నా నీ గురుతులు అస్సలు పోవట్లేదు,

అయినా పర్వాలేదు... ఎలాగో ఇంకా చేసేది కూడా ఏమీ లేదు...!! 

ఒప్పుకుంటా...!

నువ్వు ధనవంతుడివి కావొచ్చు,

ఏదైనా కొనుక్కునే స్థోమత నీకుండొచ్చు,

ప్రపంచంలో నువ్వు ఏ మూలకైనా వెళ్లొచ్చు, 

ఒక్క నా కలల్లోకి తప్ప...

ధమ్ముంటే కలల్లోకి వచ్చి చూపించు.. నువ్వు గొప్పోడివని ఒప్పుకుంటా...!!

Sunday 26 July 2020

ఇంద్రధనుస్సు



ఓ వర్షాకాలం సాయంత్రం...
రోడ్డు పక్కన ఒక చిన్న గుడిస. ఆ గుడిస బయట వర్షం లో ఆడుకుంటున్న ఒక పదేళ్ల కుర్రాడు. ఆడుతూ ఆడుతూ అనుకోకుండా ఆకాశం వైపు చూస్తాడు. ఒక్క సారిగా గట్టిగా అరుస్తాడు. అరుపు విని గుడిసకి అవతల పక్క పని చేసుకుంటున్న అతని అమ్మ-నాన్నలు భయపడుతూ వస్తారు. ఏంజరిగింది అని అడిగితె, ఆనందం తో గంతులేస్తూ తన చేతి తో ఆకాశం లో ఏర్పడ్డ ఇంద్రధనుస్సు ను చూపిస్తాడు. కొడుకు ఆనందం చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. ముందు అన్ని పెద్ద పెద్ద మేడలు ఉండడం వల్ల ఇంద్రధనుస్సు కొంచమే కనిపిస్తుంటుంది. నిరాశపడుతూ "ఇక్కడ్నించి మొత్తం కనిపించట్లేదు, ఇటెల్తే చెట్లు అడ్డొస్తున్నాయి అటెల్తే మేడలు అడ్డొస్తున్నాయి. మనం ఆ మేడలో ఉండుంటే మొత్తం కనిపించేది", అని గుడిసెలోకి వెళ్ళిపోతాడు దిగాలుగా.

ఇప్పుడు రోడ్డు మీద పిల్లాడికి అడ్డం వచ్చిన మేడల్లో లో ఒక మేడ. ఒక పిల్లాడు ఆకాశం లో ఇంద్రధనుస్సు ని చూస్తూ పక్కనే ఉన్న తండ్రి తో "ఎంత బాగుందో నాన్న! అన్ని రంగులూ బాగా కనిపిస్తున్నాయి. కానీ సగమే కనిపిస్తుంది ఇక్కడ్నించి", అని అంటాడు. తనకి అడ్డొస్తున్న పదంతస్తుల మేడ వైపు చూపిస్తూ "ఆ పదో అంతస్తు లో మనం ఉండుంటే ఇంద్రధనుస్సు పూర్తిగా కనిపించేది కదా నాన్నా?", అని అడుగుతూ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు నిరాశగా.

పదో అంతస్తులోని ఒక ఇంటి బాల్కనీ. ఒక పిల్లాడు ఆకాశం వైపు చూస్తుంటాడు. పక్కనే ఉన్న తల్లిదండ్రులని "ఇంద్రధనుస్సు లో ఏం ఏం రంగులుంటాయి అసలు?", అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఒక్కొక్కటిగా అన్ని రంగుల పేర్లు ఒక్కో పండుతో పోల్చి చెప్తారు. అవి విన్న ఆ పిల్లాడు "నాకు కళ్ళు ఉండుంటే ఆ రంగులన్నీ చూసేవాడ్ని కాదమ్మా? కానీ మీరు చెప్తుంటే నేను వాటిని ఊహించుకుంటున్న నాన్నా", అని ఆనందం గా నవ్వుతూ లోపలి వెళ్ళిపోతాడు.

సాయంత్రం కాస్త చీకటి పడిపోయింది. కథ అయిపోయింది!

సారాంశం: దొరకని దాని గురించి బాధ పడకు. దొరికిన దానితో సంతృప్తి పడు. కొంతమందికి దేవుడు అన్ని ఇస్తాడు. కానీ, అవి చూసి ఆనంద పాడటానికి కళ్ళు ఇవ్వడు. ఉన్న దానిలో ఆనందం వెతుక్కొని సంతోషం గా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే జీవితం హాయిగా సాగిపోతుంది!
 

Sunday 14 June 2020

బాధపడకు

ఎండా కాలం లో ఆవిరైన నీరు,
వర్షా కాలం లో చినుకై మన పైన పడ్తుంది.
బాధపడకు!
ఈరోజు ఆవిరవుతున్న నీ ఆనందం,
తిరిగి రేపు ఏదో ఒక రోజు సంతోషమై అది నీమీదే కురుస్తుంది.
బాధపడకు!!  

ఒకటి-రెండు!

ఒక మనిషి మరో మనిషిని రెండు సార్లు మాత్రమే మనస్ఫూర్తిగా ఇష్టపడతాడు, గౌరవిస్తాడు!
ఒకటి, వాళ్ళు పుట్టినప్పుడు...
రెండు, వాళ్ళు చనిపోయినప్పుడు...
ఈ రెండిటి మధ్యలో వాళ్ళపై ఏదో ఒక అసంతృప్తి తో  బతుకుతూనే  ఉంటాడు!!

Thursday 9 April 2020

తెల్వదు!

మనిషి జీవితం ఆకు పై నిలిచిన వర్షపు నీటి చుక్క లెక్క!
ఎప్పుడు ఎక్కడ్నించి పడ్తదో తెల్వదు,
ఏ ఆకు మీద పడ్తదో తెల్వదు,
పడ్డంక ఎంత సేపు ఆ ఆకు మీద ఉంటదో తెల్వదు,
ఎప్పుడు మట్టిలకి జారి పడ్తదో తెల్వదు,
ఎప్పుడు ఆవిరై ఆకాశం లకి ఎగిరి పోతదో తెల్వదు!!

ఏదో ఒక రోజు పోతది!

కోపం ఏదో ఒక రోజు పోతది,
ప్రేమ ఏదో ఒక రోజు పోతది,
ద్వేషం ఏదో ఒక రోజు పోతది,
జాలి ఏదో ఒక రోజు పోతది,
బాధ ఏదో ఒక రోజు పోతది,
సంతోషం ఏదో ఒక రోజు పోతది,
గౌరవం ఏదో ఒక రోజు పోతది,
పైసా ఏదో ఒక రోజు పోతది,
మంచి ఏదో ఒక రోజు పోతది,
చెడు ఏదో ఒక రోజు పోతది,
స్నేహం ఏదో ఒక రోజు పోతది,
శత్రుత్వం ఏదో ఒక రోజు పోతది,
కరోనా కూడా ఏదో ఒక రోజు పోతది,
అట్ల కాదు అని నువ్వు ఇంట్ల ఉండకుండ టైంపాస్ కొరకు బైట తిర్గుతె,
నీ ప్రాణం కూడా తొందర్లనే  ఏదో ఒక రోజు పోతది!